Sunday 11 December 2011

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింల అపురూప త్యాగాలను వెల్లడించే అరుదైన చరిత్ర గ్రంథం భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింల అపురూప త్యాగాలను వెల్లడించే అరుదైన చరిత్ర గ్రంథం
భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు
-డి. నటరాజ్‌, డిప్యూటీ రిజిష్ట్రార్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం.

    భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని వెల్లడిస్తూ వరుసగా గ్రంథాలను ప్రచురిస్తున్న ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ నిరంతర కృషిని విశ్లేషిస్తూ 'సింహాల నుండి ఒక చరిత్రకారుడు పుట్టుకొచ్చేంత వరకు వేటగాడు చెప్పే కట్టుకథలు, పిట్టకథలే చరిత్రగా చలామణి అవుతాయి' అనే ఆఫ్రికన్‌ సామెతను ఉటంకించి, 'ఇప్పుడు సింహాల నుండే ఒక చరిత్రకారుడు పుట్టాడు. వేటగాడు చెబుతున్న కట్టుకథలనూ పిట్టకథలనూ సవాల్‌ చేస్తున్నాడు. అతడే సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌' అని విమర్శకుడు బత్తుల కాంతయ్య తన వ్యాసంలో (బహుజన కెరటాలు,ఆగస్టు 2007) ప్రకటిస్తాడు. నశీర్‌ అహమ్మద్‌ వెలువరించిన ప్రతి గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్న నాకు ఆయన తన గ్రంథాల ద్వారా 'సవాళ్ళు చేయడం' కాకుండా ప్రముఖ చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ (హైదరాబాద్‌) ఆభిప్రాయపడ్డట్టు 'చరిత్ర లోటును పూడ్చుతున్నారు'. 'ఈ దేశంలో కలసిమెలసి సహజీవనం సాగిస్తున్న వివిధ సాంఘిక జన సముదాయాలు తమ పూర్వీకులు మాతృదేశ విముక్తి కోసం...చేసిన త్యాగాలనూ, సాగించిన కృషిని పరస్పరం తెలుసుకుంటే ఒకరి పట్ల మరొకరికి గౌరవభావం కలుగుతుంది. ఆ గౌరవభావం జన సముదాయాల మధ్య మంచి సదవగాహన, సద్భావన పరిఢవిల్లడానికి తోడ్పడుతుంది. ఆ సద్భావన నుండి సహిష్ణుత జనిస్తుందని, సామరస్య వాతావరణం మరింత వర్థిలుతుందని' తన విశ్వాసాన్ని ప్రకటించిన నశీర్‌ అహమ్మద్‌ ఆ లక్ష్యం దిశగా శ్రమిస్తూ 'భారత స్వాతంత్య్రోద్యంమంలో ముస్లింల పాత్ర' ను వెల్లడిస్తు 1999 నుండి వరుసగా చరిత్ర గ్రంథాలను తెలుగు పాఠకులకు అందిస్తున్నారు.
    ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ముస్లింలు స్వాతంత్య్రోద్యంలో నిర్వహించిన పాత్ర ప్రధానాంశంగా 'భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథాన్ని 2001లో తొలిసారిగా వెలువరించారు. ఆనాడు 80 పుటలతో వెలువడిన పుస్తకం నాలుగు మాసాల్లో పునర్ముద్రితమయ్యింది. ఆ తరువాత రాష్ట్రమంతా పర్యటించి సేకరించిన సమాచారంతో దాన్ని తిరగరాసి 394 పుటలతో విస్త్రుతపర్చి ప్రస్తుత గ్రంథాన్ని తెచ్చారు. ఈ గ్రంథం మొదటి భాగంలో స్వాతంత్య్రోద్యమాన్ని 1780 నుండి 1947 వరకు పేర్కొంటూ, ఆయా పోరాటాలలో ముస్లింల భాగస్వామ్యాన్ని కథన రూపంలో, తగిన అపురూప చిత్రాలతో అందించారు. రెండవ భాగంలో 50 మంది సమర వీరుల జీవిత-పోరాట చరిత్రను వివరిస్తూ, వారి చిత్రాలను కూడా పొందుపర్చారు. మూడవ భాగంలో విముక్తి పోరాటం కొనసాగింపుగా జరిగిన ప్రజాపోరాటాలలో పాల్గొన్న యోధుల విశేషాలను, నాల్గవ భాగంలో జిల్లాల వారిగా స్వాతంత్య్ర సమరయోధుల వివరాలను సంక్షిప్తంగా అందించారు. చివర్లో సమాచార సేకరణ సందర్భంగా తాను అనుభవించిన తీపి-చేదు అనుభవాలను 'చివర్లో మీతో ఓ మాట' శీర్షిక ప్రకటిస్తూ, సమాచార సేకరణ కోసం తాను కలసిన స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులు, విషయపరంగా తనకు సహకరించిన చరిత్రోపన్యాసకులు, చరిత్రకారులు, రచయితలు, జర్నలిస్టులు, మిత్రులు-సన్నిహితులు, ఏ ఒక్కరిని విస్మరించకుండా పెద్దజాబితాను కూడా ప్రకటించడం రచయితలోని 'సమష్టి భావన' కు తార్కాణంగా పేర్కొనవచ్చు.
    ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి 80 ఏండ్ల క్రితమే, 1780లో విశాఖపట్నం ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో వెల్లువెత్తిన సైనిక తిరుగుబాటుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ నాయకత్వం వహించాడన్న కథనంతో ఆరంభమైన ఈ గ్రంథం నిండా విస్మయం కల్గించే నిఖార్సయిన చారిత్రక వాస్తవాలెన్నో ఉన్నాయి. విశాఖపట్నం అబూసరంగ్‌ వీధిలో ఫిరంగి ప్రేలుడుకు తునాతునకలైన సుబేదార్‌ అహమ్మద్‌ వీరోచిత సంఘటన ఆంధ్రులకు గర్వకారణమైనప్పటికి మనలో 'మన' అనుభావం మృగ్యమైనందున ఆయనకు, ఆయన సహచరులకు తగినంత ప్రాధాన్యత దక్కలేదు. ఈ సంఘటన ఏ తమిళనాడులో జరిగివుంటే సుబేదార్‌ అహమ్మద్‌కు, ఆయన సహచరులకు ప్రభుత్వం-ప్రజలు నిరాజనాలు పట్టేవారు. తిరుగుబాటు యోధుడు సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ నుండి ఆరంభమై నూరుల్‌ ఉమ్రా, మీర్‌ గోహర్‌ అలీ ఖాన్‌లు 1857 కంటే ముందుగా ఆంగ్ల పటాలాల మీద యుద్ధాన్ని ప్రకటించిన తీరు, కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ ఆంగ్లేయుల మీద యుద్ధం కోసం కర్నూలు కోటను  ఆయుధాల కర్మాగారం-గిడ్డంగిగా మార్చి, చివరివరకు ఆంగ్ల సైన్యాలతో పోరాడిన వైనం చదువుతుంటే వళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. కడప ప్రజానాయకుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి 1846లోనే అండదండలుగా నిలచిన మహమ్మద్‌ ఖాన్‌, 1857లో హైదరాబాద్‌లోని బ్రిటీష్‌ రెసిడెన్సీ మీద జరిగిన సాహసోపేత దాడికి నాయకత్వం వహించిన పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌లు చూపిన తెగువ, కడప గడపన తిరుగుబాటుకు విఫలప్రయత్నం చేసి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన షేక్‌ పీర్‌ షా వ్యూహాన్ని కళ్ళకు కట్టినట్టుగా రచయిత ఈ గ్రంథంలో వివరించారు.
    ప్రజా క్షేమం పట్టని ప్రభువులను ప్రశ్నించ వచ్చన్న ధైర్యాన్ని 1883లోనే ప్రజలకు సంతరింపచేసిన జాతీయ పునర్వికాసోద్యమ నిర్మాతల్లో ఒకరుగా ఖ్యాతిగాంచిన ముల్లా అబ్దుల్‌ ఖయ్యూంతో ప్రారంభమై జాతీయోద్యమంలో పాల్గొన్న యోధాగ్రేసుల త్యాగపూరిత -సాహసోపేత జీవిత సంఘటలు పుటలుగా ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి. మన్యం పోరులో అల్లూరి సీతారామరాజుకు అన్ని విధాల అండదండలిచ్చి, ఆయన ఉద్యమానికి 'రథసారధి'గా కీర్తించబడిన డిప్యూటీ కలక్టర్‌ ఫజులుల్లా ఖాన్‌, అల్లూరి సహచరుల ఆయుధాలను తన ఇంటదాచి మన్యం పితూరికి సహకరించిన జాతీయోద్యమకారుడు, మహాకవి మౌల్వీ ఉమర్‌ అలీషా (పిఠాపురం), నైజాం సంస్థానంలో బ్రిటీష్‌ వ్యతిరేక శక్తులు ఏకమయ్యేందుకు నిరంతరం కృషిచేసిన ఉద్యమకారుడు బద్రుల్‌ హసన్‌, ఖిలాఫత్‌- సహాయనిరాకరణ ప్రకటించగానే తొట్టతొలుతగా తన పదవికి రాజీనామా చేసిన తొలి ఆంధ్రుడిగా స్వయంగా మహాత్ముడి అభినందనలు అందుకున్న గులాం మొహిద్దీన్‌ (విజయవాడ), ఖద్దరు ఉద్యమానికి అంకితమై 'ఖద్దరు ఇస్మాయిల్‌'గా పిలువబడి, సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (తెనాలి)ల కార్యదక్షత-త్యాగనిరతి పాఠకుల్ని అబ్బురపర్చుతాయి.
    నైజాం ప్రభుత్వంచే బహిష్కృతుడై ఉత్తేజపూరిత ప్రసంగాలతో దేశమంతా పర్యటిస్తూ అన్ని ప్రాంతాల ప్రజలను జాతీయోద్యమం దిశగా నడపటంలో దిట్టగా పేర్గాంచిన మగ్బూల్‌ అహమ్మద్‌ జమాయ్‌ (హైదరాబాద్‌), భూరి విరాళాలతో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆర్థిక పరిపుష్టి కల్పించిన యం.యం.ఖాద్రి బియబానీ (కర్నూలు), జాతీయోద్యమానికి తన్ను తాను అంకితం చేసుకోవడం కాకుండా తన బిడ్డలను (అబిద్‌ హసన్‌ సఫ్రాని, బద్రుల్‌ హసన్‌) కూడా బ్రిటీష్‌ వ్యతిరేక శక్తులుగా తీర్చిద్దిన ఫక్రుల్‌ హజియా హసన్‌, చీరాల-పేరాల పోరాటం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, శాసలోల్లంఘన ఉద్యమాలలో అసమాన ధైర్యసాహసాలు చూపి, సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గిన మహమ్మద్‌ గౌస్‌ సాహెబ్‌ (బాపట్ల), విద్యార్థి-యువజనులను జాతీయోద్యమం దిశగా నడిపించడంలో ప్రత్యేకంగా కృషిచేస్తూ జైలుపాలైన షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌ (గుంటూరు), చివరి శ్వాసవరకు గాంధీ మార్గంలో నడిచి 'విశాఖ గాంధీ'గా విఖ్యాతుడైన ఫరీద్దుల్‌ జమా (విశాఖపట్నం) లాంటి యోధులు ఈ గ్రంథంలో తారసపడతారు.
    స్వాతంత్య్రోద్యమ సాహిత్య చరిత్రలో అపూర్వ నినాదంగా నిలచిన 'జైహింద్‌', సుభాష్‌ చంద్రబోస్‌ పేరును కూడా మర్చిపోయేలా చేసిన 'నేతాజీ' అను పదాల సృష్టికర్త హైదరాబాద్‌కు చెందిన అబిద్‌హసన్‌ సఫ్రాని అంటే పాఠకుడు ఆనందాశ్చర్యాలకు లోనుకాక తప్పదు. జర్మనీలో నేతాజీకి పరిచయమైన విద్యార్ధి అబిద్‌ హసన్‌ 'భారత జాతీయ సైన్యం'లో ప్రముఖ పాత్ర వహించడం, నేతాజీ చేసిన ప్రమాదకర, చారిత్మ్రాక జలాంతర్గమి ప్రయాణంలో ఆయనను అనుసరించిన ఏకైక భారతీయుడిగా విఖ్యాతుడైన అబిద్‌ హసన్‌ తెలుగువాడని తెలిసి తెలుగు ప్రజలు ఆనందాశ్చర్యాలకు లోనుకాక తప్పదు. చిన్నవయస్సులోనే ఆంగ్లేయ పాలకులను వ్యతిరేకిస్తూ పోరాట కార్యక్రమాలలో పాల్గొని ఆంగ్లపోలీసుల దాష్ఠికాన్ని రుచి చూడటమే కాకుండా, ఆంధ్ర మున్సిపల్‌ వర్కర్ల సంఘం నిర్మాతల్లో ఒకరుగా నిలిచిన మహమ్మద్‌ హనీఫ్‌, నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలపాల్సిన అవసరాన్ని వివరిస్తూ నిజాం నవాబుకు ఉత్తరం పంపాలని సంకల్పించిన నైజాం ప్రభుత్వాధికారి ఫరీద్‌ మీర్జా, 'నిజాంకు ఏడుగురు ప్రముఖుల వినతి' పేరుతో ప్రసిద్ధమైన ఆ లేఖను తయారు చేసిన బారిష్టర్‌ బాఖర్‌ అలీ మీర్జా సాహసం, నిజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలన్న ప్రజల డిమాండ్‌కు అండగా నిలచి రజాకార్ల దాడిలో అమరుడైన పాత్రికేయుడు షోయాబుల్లా ఖాన్‌ లాంటి జాతీయోద్యమకారుల త్యాగాలను చదువుతుంటే కళ్ళు చెమర్చక మానవు.
    మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటంలో పురుషులు మాత్రమేకాదు మహిళలూ తమదైన భాగస్వామ్యాన్ని అందించిన వైనాన్ని పేర్కొంటూ,  మహాత్ముని బాటన సేవా కార్యక్రమాలలో పాల్గొని అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన జాతీయోద్యమకారిణి మాసుమా బేగం (హైదరాబాద్‌), యుద్దం వద్దు వద్దంటూ బహిరంగ ప్రదర్శనలో నినదించిన రబియాబీ (చియ్యడు- అనంతపురం), భర్త సాగిన పోరుబాటకు తన త్యాగాలతో సహకరించిన గౌస్‌ ఖాతూన్‌ (బాపట్ల), మాతృభూమి సేవకు పరిహారం తగదంటూ ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి-ఆర్థిక తోడ్పాటును నిరాకరించి, తన స్వంత భూమిని వినయాశ్రమానికి (తెనాలి) విరాళంగా ఇచ్చిన హాజరా బీబి ఇస్మాయిల్‌ (తెనాలి), అటు జాతీయోద్యమంలో ఇటు కమ్యూనిస్టు ఉద్యంలో సాహసోపేత పాత్రను నిర్వహించిన అక్కచెళ్లెళ్ళు జమాలున్నీసా బాజీ, రజియా బేగం (హైదరాబాద్‌) వివరాలు, తెలంగాణా సాయుధపోరాటంలో పాల్గన్న జైనాబీ లాంటి వీరనారీమణుల విశేషాంశాలతో గ్రంథానికి వీలయినంతగా సమగ్రతను సంతరించి పెట్టారు రచయిత. తెలుగు గడ్డ మీద పుట్టి పలు కారణాల వల్ల ఉత్తర భారతదేశం వెళ్ళి జాతీయోద్యమంలో పాల్గొన్న బేగం మజీదా బానో, బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా లాంటి మహిళలు ఈ పుస్తకం ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం కావడం విశేషం. 
    చిన్ననాటనే బర్మావెళ్ళి అక్కడి రబ్బరు తోటల్లో శ్రమిస్తూ కూడబెట్టుకున్న 20వేల రూపాయలను 1945 ప్రాంతంలో నేతాజీ ఇచ్చిన పిలుపు మేరకు 'ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌'కు విరాళంగా ఇచ్చేసి, తాను కూడా భారత జాతీయ సైన్యంలో 'రైఫిల్‌మన్‌'గా సేవలందించిన త్యాగశీలి-సాహసి షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ (వేపాడు-విజయనగరం), భారత స్వతంత్ర భానుడు ఉదయిస్తున్న సమయంలో నిజాం సంస్థానం నుండి వేరుపడి స్వయంగా 'రిపబ్లిక్‌' ప్రకటించుకున్న కృష్ణా జిల్లా పరిటాల పరగణాలో జాతీయపతాకాన్ని ఎగురవేసి, నిజాం తాబేదార్ల దాష్ఠికానికి గురైనప్పటికీి ధైర్యంవీడని షేక్‌ మౌలా సాహెబ్‌ (పరిటాల) మొన్నమొన్నటి వరకు స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందని దౌర్భాగ్యపరిస్థితులను ఎదుర్కొన్న వైనాన్ని చదువుతుంటే ఆగ్రహం కలుగుతుంది. ఈ యోధులిద్దరూ స్వయంగా వివరించిన అలనాటి కథనాలను దృశ్యమానంగా అక్షరీకరించడంలో రచయిత నశీర్‌ అహమ్మద్‌ సఫలమయ్యారు.
    జాతీయోద్యమానికి కొనసాగింపుగా జరిగిన పోరాటాలలో పాల్గొన్న యోధులను కూడా గ్రంథంలో స్థానం కల్పిస్తూ, తెలంగాణా ప్రాంతంలోని దేశ్‌ముఖ్‌ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం సాగిస్తూ దారుణ హత్యకు గురైన షేక్‌ బందగీ సాహెబ్‌, విద్యార్థిగా జాతీయోద్యమం చివరి థలో ఉద్యమించడం మాత్రమే కాకుండా కార్మిక-కర్షక హితాన్ని ఆశిస్తూ పోరుబాట సాగి చివరకు పాకిస్థాన్‌ జైలులో అమరత్వం పొందిన సయ్యద్‌ హసన్‌ నాసిర్‌, తెలంగాణా సాయుధపోరాట యోధుడు షేక్‌ నన్నే బచ్చా, నిజాం వంశీకుడైనా పాత్రికేయుడిగా ప్రజల పక్షం వహించిన జహందర్‌ అఫ్సర్‌ లాంటి యోధులకు తన గ్రంథంలో రచయిత స్థానం కల్పించారు.ఈ మేరకు 'ప్రముఖ ఆంధ్రదేశ చరిత్రకారులు అచార్యులు మామిడి పూడి వెంకట రంగయ్య, సరోజిని రెగాని, బయినపల్లి కేశవ నారాయణ లాంటి వారు తమ రచనల్లో తెల్పనటువంటి అనేక విషయాల్ని, సంఘటల్ని, పోరాటయోధుల సమాచారాన్ని సేకరించి నశీర్‌ గారు ఈ గ్రంథం ద్వారా పాఠకులకు అందిచార'ని గ్రంథం ముందుమాటలో ఆచార్య అడపా సత్యనారాయణ (ఉస్మానియా విశ్వవిద్యాలయం) పేర్కొనడం సమగ్రత కోసం రచయిత చేసిన బృహత్తర కృషిని బహిర్గతం చేస్తుంది. అంతేకాదు నశీర్‌ కృషిని ప్రస్తావిస్తూ 'ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని ప్రోఫెసర్లు సైతం చేయలేకపోయిన/పోతున్న పనిని నశీర్‌ అహమ్మద్‌ ఒక్కరుగా చేసుకురావడం ఎవరికైనా ఆశ్చర్యం కల్గించక మానద'ని మరో సందర్భంగా చరిత్రోపన్యాసకులు డాక్టర్‌ జి సాంబశివారెడ్డి (వేమన విశ్వవిద్యాలయం) పేర్కొనడం ఈ గ్రంథాన్ని చదివాక అక్షరసత్యం అన్పిస్తుంది.
    చరిత్ర ఎల్లప్పుడు విలువైనదే. అది రత్నం లాంటిది. రత్నమెప్పుడూ రత్నమే. వర్తమాన రాజకీయ చరిత్రలోనూ, కనీసం మూడు వందల ఏళ్ళ చరిత్రలోనూ, స్వాతంత్య్రోద్యమ, స్వేచ్ఛా పిపాస కలిగిన చరిత్రలలో యీ  గ్రంథం ఆణిముత్యం. జాతీయోద్యమ స్వాతంత్య్రసమరయోధులను మాత్రమే కాకుండా అనంతర ఉద్యమాలలో భాగస్వాములైన యోధుల విశేషాలను కూడా వెల్లడి చేస్తూ అలనాటి యోధులందర్ని మృత్యుంజయులుగా మార్చివేశారు. ప్రోఫెసర్‌ ఆచార్య రామలక్ష్మి (ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం) పేర్కొనట్టుగా, 'సామాన్య ప్రజానీకానికి మాత్రమే కాకుండా చరిత్రలో ప్రవేశమున్న వారికి సహితం తెలియని స్వాతంత్య్రసమరయోధుల జీవితాలను, వారి జీవితాలలోని ప్రత్యేక ఘట్టాలను పరిచయం' చేస్తున్న రచయిత కృషి ప్రశంసనీయం. 'నశీర్‌ వెలువరించిన ప్రతి గ్రంథం డాక్టర్‌రేట్‌ ఇవ్వదగ్గ పరిశోధనాత్మక గ్రంథం' అని ప్రముఖ భాషాశ్రాస్తవేత్త ప్రోఫెసర్‌ చేకూరి రామారావు పేర్కొన్నారంటే నశీర్‌ గ్రంథాల ప్రామాణికత  వెల్లడవుతుంది.  'భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' లాంటి పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వరుసగా అందిస్తున్న చరిత్రకారుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ప్రయత్నాలు మరింత విస్త్రుతి చెంది మరుగున పడిన చారిత్రక వాస్తవాలు సామాన్య ప్రజల్లోకి ప్రవహించాలంటే చరిత్ర పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రజలు-ప్రభుత్వం, ప్రధానంగా ముస్లిం సమాజం ఆర్థిక-హర్థిక తోడ్పాటు అందించాలి.

2 comments: